Infosys Warning To Employees: ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ తమ సంస్థలోని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. మూన్‌లైటింగ్ చీటింగ్ చేస్తే ఉద్యోగాలను పీకేస్తామంటూ హెచ్చరించింది. మూన్‌లైటింగ్ విషయంపై ఇన్ఫోసిస్ సంస్థ తన ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా ఓ లేఖను పంపించింది. అయితే.. ఇంత తీవ్రస్థాయిలో ఉద్యోగులకు హెచ్చరికలు చేయడం వెనుక ప్రధాన కారణమే ఉంది. మూన్‌లైటింగ్ వ్యవహారం ఉత్పాదకతతో పాటు, ఉద్యోగ సామర్ధ్యం, డేటా రిస్క్, గోప్యతతో కూడిన డేటా బహిర్గతమయ్యే ముప్పు వంటి తీవ్ర సవాళ్లకు దారితీస్తోందని ఇన్ఫోసిస్ ఆందోళన వ్యక్తం చేసింది.
మూన్‌లైటింగ్ అంటే ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ మరో కంపెనీలో పార్ట్ టైమ్, ఫుల్‌టైమ్‌గా మరో ఎంప్లాయిమెంట్ చేయడమేనన్నమాట. కరోనా తరువాత ఇండియన్ ఐటీ రంగంలో రిమోట్ వర్క్ ఎక్కువగా పెరగడంతో ఉద్యోగులు ఎక్కువగా ఈ మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారు. ఐటీ టాలెంట్ కన్సల్టింగ్ అండ్ ఇంటెలిజెన్స్ సంస్థ హ్యాన్ డిజిటల్ రిపోర్టు ప్రకారం.. ప్రతి వంద మందిలో ముగ్గురు నుంచి నలుగురు ఉద్యోగులు ఒకేసారి రెండు అసైన్‌మెంట్స్, ప్రాజెక్టులు చేస్తున్నట్లు తెలిపింది.
కంపెనీ నుంచి ముందస్తు పర్మిషన్ లేకుండా ఫుల్ టైమ్‌గా లేదా పార్ట్‌టైమ్‌గా వేరే దగ్గర కూడా పనిచేయడం నిబంధనలకు విరుద్ధం. అలా చేస్తే ఉద్యోగం నుంచి పీకేస్తామంటూ ఈ నెల 12న ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా తెలిపింది. ప్రత్యామ్నాయ ఉద్యోగాన్ని చేపట్టేముందు ఉద్యోగులు ఒకసారి తమ ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్టును చదవాలని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో కంపెనీ స్పష్టం చేసింది. పనివేళల్లో, పని వేళలు ముగిసిన తర్వాతకూడా మరోజాబ్ చేయొద్దని, నిబంధనలకు విరుద్ధంగా రెండో జాబ్ చేసే ఉద్యోగులను తొలగిస్తామని ఇన్ఫోసిస్ ఉద్యోగులను తీవ్రస్థాయిలో హెచ్చరించింది.