ఒక్క క్షణం ఆగి మీ ఇళ్ల గురించి ఆలోచించండి. మీ మూలాల గురించి ఆలోచించండి. ప్రపంచంలో మీరు అత్యంత ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం గురించి ఒకసారి ఆలోచించండి.
ఒకవేళ మీకు అత్యంత ప్రియమైన ప్రాంతం, ఈ భూమి నుంచి మాయమైపోతే? అలా ఊహించుకోవడం కూడా ఎంతో బాధగా ఉంది కదా! కానీ, భూమిపై ఉన్న డజన్ల కొద్దీ ద్వీపాలకు ఈ భయం అనేది కేవలం ఊహ కాదు. రాబోయే కాలంలో ఇదే జరుగనున్న వాస్తవం. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరగడంతో ఇప్పటికే ఈ ద్వీపాలు తమ భూభాగాన్ని కోల్పోతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ నివసించే ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో చిన్న ద్వీప దేశం ‘టువాలు’ ప్రస్తుత పరిస్థితి గురించి బీబీసీ ముండో అధ్యయనం చేసింది. వాతావరణ మార్పు వల్ల ప్రభావితం అయిన ద్వీప దేశాల్లో టువాలు కూడా ఒకటి. గ్రీస్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకునేందుకు కృషి చేయాలని ప్రపంచంలో అత్యధిక కాలుష్యానికి కేంద్రాలుగా ఉన్న దేశాలను ఈ ద్వీప దేశం అభ్యర్థిస్తోంది.
మిగతా దేశాలను కోరడంతో పాటు, తాము ఎదుర్కోబోయే దారుణ సమయాలను ఎదుర్కోవడానికి కూడా ఈ దేశం సన్నద్ధమవుతోంది. ఈ దేశం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే, ఎప్పుడు అది నీటిలో పూర్తిగా మునిగిపోతుందో చెప్పలేం. వాతావరణ మార్పులను ఉద్దేశించి జరిగిన కాప్-26 సదస్సుకు తువాలు దేశ విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, న్యాయశాఖ మంత్రి సిమోన్ కోఫె ఉద్వేగపూరిత సందేశాన్ని పంపించారు. వాతావరణ మార్పుల వల్ల తలెత్తే సంక్షోభాల గురించి చర్చించడానికి, వాటికి తగిన పరిష్కారం వెతికేందుకు గ్లాస్గో, స్కాట్లాండ్ వేదికగా జరిగిన ఈ కాప్-26 సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నాయకులు పాల్గొన్నారు.
”మేం మునిగిపోతున్నాం. కానీ, అందరికీ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది” అని సిమోన్ వ్యాఖ్యానించారు. తన సందేశం వెలువరించే సమయంలో సిమోన్, మోకాలి లోతు నీటిలో నిల్చున్నారు. ఆయన నిల్చున్న ప్రాంతం ఒకప్పుడు పొడిగా ఉండేది. కానీ వాతావరణ మార్పుల కారణంగా ఇప్పుడు అది నీటిలో మునిగిపోయింది. ”వాతావరణ సంక్షోభాల వల్ల కలిగే భయంకరమైన పరిణామాలకు ప్రస్తుత టువాలు పరిస్థితి అద్దం పడుతోంది. ఈరోజు టువాలు ఉన్న స్థితికి వాతావరణ మార్పులే కారణం. రానున్న కాలంలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా దీనివల్ల ప్రభావితం అవుతాయి” అని సిమోన్ పేర్కొన్నారు.